పచ్చాపచ్చని చీరకట్టి , గాలికి రెపరెపలాడే , నేలా తల్లి ఒళ్ళు నేడే నెర్రెలిచ్చేనా .... అయ్యో రైతన్నేమో మాయమయ్యేనా , అయ్యో రైతన్నే మాయమయ్యేనా ....
నాగలిబట్టి , దుక్కిదున్ని , విత్తునాటి , పైరుకోసి , కుప్పలేసి అమ్మబోతే మన్ను మిగిలేనా అన్నా నీ నోటి కాడికి కూడు చేరేనా .....
గద్దెలెక్కిన పెద్దలేమో రైతుయే మహరాజు అంటూ , రైతులేనిదే దేశమే లేనేలేదంటూ .... సభలు పెట్టి , మైకు పట్టి , ఊకదంపుడు దంచికొట్టి , చేయలేకో చేతగాకో చేయడానికి మనసు రాకో చల్లటేలా మెల్లగా జారుకుంటుంటే .....
ఎండ అనక , వానలనక , చలిని కూడా లెక్కచేయక , మండే సూరికెదురు నిలిచి సాగు చేస్తున్నా ..... పుడమి కడుపులో నీరు లేక పైరు ఏమో నేల చూపులు .... మింటి నుండి చుక్క రాలదు నీ కంటిలో కన్నీరు ఆగదు .....
కరువు కోరలు కాటువేయగ పొలము పండక బాధకుండగా , అరువు కాకులు చుట్టుముట్టి శ్వాసకూడా సలుపనీయక ..... నేల చేరని నీటి కోసం వెతికి వెతికి వేసారి , వెతకలేక ఆశ జారి ...... చివరి సారిగ వెతకడానికి నింగి చేరావా .... ఆ మబ్బులో కన్నీరు నింపి నేలకంపేవా .....
ఓ రైతన్నా ఆ మబ్బుల్లో నీ కన్నీరు నింపి నేలకంపేవా .....
No comments:
Post a Comment